జోగి రమేష్ అరెస్ట్‌.. కాశీబుగ్గ‌ డైవ‌ర్ష‌న్‌లో భాగ‌మా..?

జోగి రమేష్ అరెస్ట్‌.. కాశీబుగ్గ‌ డైవ‌ర్ష‌న్‌లో భాగ‌మా..?

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సంద‌ర్భంగా ఇబ్ర‌హీంప‌ట్నంలోని ఆయ‌న నివాసం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అరెస్ట్ అనంత‌రం ఆయ‌న్ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఆయనతో పాటు సోదరుడు జోగి రాము కూడా అరెస్టైనట్లు సమాచారం. ఈ అరెస్ట్‌పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని మండిపడుతున్నారు.

జోగి రమేష్ తన అరెస్ట్‌పై స్పందిస్తూ, “తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇది చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలే ప్రధాన నిందితులు, వారిని కాపాడేందుకు న‌న్ను ఇరికిస్తున్నారు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య. అసలు నిందితులను వదిలేసి, సంబంధం లేని వారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు కూడా ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్ర అని అన్నారు. నిన్న కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందగా, ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై విమర్శలు పెరిగిన నేపథ్యంలో, ఆ దృష్టిని మళ్లించేందుకు ఈ అరెస్ట్ జరిగిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక మోంథా తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న సమయంలో, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ప్రజల ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకే జోగి రమేష్‌పై చర్యలు తీసుకున్నారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అసలు నకిలీ లిక్కర్ మాఫియాలో టీడీపీ నేతలే ప్రమేయం ఉన్నప్పటికీ, వారిని వదిలేసి నిరపరాధులపై కేసులు మోపడం దారుణమని వారు విమర్శిస్తున్నారు.

నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని ప్రజలంతా చూశారు. తన పార్టీకి చెందిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్య‌ర్థి జయంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు జనార్దనరావులు, మరొక టీడీపీ నాయకుడు సురేంద్ర నాయుడు.. ఇలా తన, త‌న మంత్రుల‌, ఎమ్మెల్యేల‌ సన్నిహితులు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి, ఒక మాఫియాను ఎలా నడిపారో చూశామ‌ని దాని నుంచి దృష్టి మ‌ర‌ల్చేందుకే జోగి ర‌మేష్‌ను అరెస్ట్ చేశార‌ని మండిప‌డుతున్నారు.

ఈకేసులో అటు జయంద్రారెడ్డిని, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిని కాని, పీఏ రాజేష్‌ను కాని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. నెలరోజులవుతున్నా.. మీనమేషాలు లెక్కిస్తున్నారు కాని, వారిని చట్టంముందు మాత్రం నిలబెట్టలేకపోయారు. ఏ సంబంధం లేని జోగి రమేష్‌పై బురదజల్లి అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment