తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రి పరిధిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో (Adikavi Nannaya University) రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పర్యటన సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఫ్లెక్సీల తొలగింపు (Flex Banners) అంశం వివాదానికి దారి తీసింది. ఇతర ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ, రాజానగరం జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA) బత్తుల బలరామకృష్ణ (Bathula Balaramakrishna) ఫ్లెక్సీ మాత్రమే తొలగించారని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై వివరణ కోరేందుకు ఎమ్మెల్యే బలరామకృష్ణ భార్యతో పాటు జనసేన కార్యకర్తలు వీసీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని అందరి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగించారని జనసేన ఎమ్మెల్యే సతీమణి ప్రశ్నించగా, ఈ క్రమంలో వీసీ పీఏ ఎమ్మెల్యే భార్యను నెట్టేశారని జనసేన కార్యకర్తలు ఆరోపణలు చేశారు. దీంతో వీసీ ఆఫీసు ఎదుట “డౌన్ డౌన్” (Down Down) అంటూ నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలు తొలగించడంపై వాగ్వాదం ఘర్షణగా మారడంతో, యూనివర్సిటీ ఉద్యోగిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు యూనివర్సిటీలో ఉండకూడదన్న నిబంధనల మేరకే తొలగించామని యూనివర్సిటీ సిబ్బంది చెబుతున్నా.. ఇదంతా తెలుగుదేశం పార్టీ నేతల పనేనని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. క్షమాపణలు చెప్పకపోతే కూటమిని కూడా లెక్కచేయమని జనసేన ఎమ్మెల్యే అనుచరులు తెగేసి చెబుతున్నారు.
పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. మీడియాను యూనివర్సిటీ లోపలికి అనుమతించకుండా గేటు వద్దనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఘటన జనసేన– యూనివర్సిటీ వర్గాల మధ్య ఘర్షణ, లోకేశ్ పర్యటనలో ఉద్రిక్తతకు దారి తీశాయి. అలాగే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య నెలకొన్న విభేదాలను బహిర్గతం చేశాయనే చర్చ జరుగుతోంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) December 19, 2025
తూగో జిల్లా నన్నయ్య యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత
నారా లోకేష్ పర్యటన సందర్బంగా ప్లెక్సీల వ్యవహారంలో వివాదం
వీసీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే, నేతల యత్నం
ఎమ్మెల్యే , జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు
వీసీ ఆఫీస్ దగ్గర జనసేన కార్యకర్తల ఆందోళన pic.twitter.com/5fB70AYqbo








