కూటమిలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. తెలుగుదేశం పార్టీ అరాచకాలను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకులు రోడ్డెక్కారు. పెడనలో టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తూ నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ‘అరగంట కేటాయిస్తే పనైపోద్ది. సైనికుల గోడు తెలియజేయడానికి సమయం కేటాయించవలసిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అభ్యర్థిస్తూ’ సంతోష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని, తమ పార్టీ క్రెడిట్‌ను కూడా టీడీపీ హైజాక్ చేస్తుందని ఆ పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని నేతలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా పెడనలో తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి పవన్ అపాయింట్‌మెంట్ కోరుతూ సీరం సంతోష్ దీక్ష చేపట్టారు.
సీరం సంతోష్ దీక్షా శిబిరాన్ని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సందర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సైతం వచ్చి దీక్ష విరమింపజేయాలని సూచించినా సంతోష్ ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ-జనసేన పార్టీ నేలత వైరం ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.