గంజాయి అక్రమ రవాణా చేస్తూ జనసేన నాయకుడు తమిళనాడు పోలీసులకు పట్టుబడిన సంఘటన ఏపీలో సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు హరికృష్ణను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి, వారి వాహనం నుండి 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కుప్పం నుంచి తమిళనాడు కృష్ణగిరి మార్గంగా మదురై దిశగా కారులో గంజాయి రవాణా జరుగుతుందనే నిఘాతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కుప్పం-కృష్ణగిరి రహదారిలోని చిన్నేపల్లి ప్రాంతంలో వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఏపీ రిజిస్ట్రేషన్ టాటా సుమో కారులో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున (100 కేజీలు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మదురై జిల్లా అయ్యంపట్టు గ్రామానికి చెందిన వెల్లపాండీ, చిత్తూరు ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.








