బ‌స్తా యూరియా ఇవ్వ‌లేని అధ్వాన ప్ర‌భుత్వం – వైఎస్‌ జ‌గ‌న్ ఫైర్‌

బ‌స్తా యూరియా ఇవ్వ‌లేని అధ్వాన ప్ర‌భుత్వం - వైఎస్‌ జ‌గ‌న్ ఫైర్‌

రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తూ వైఎస్ జ‌గ‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. యూరియా అంద‌జేత‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు.

“రైతులు ఒకప్పుడు సులభంగా పొందిన యూరియా బస్తా కోసం ఇప్పుడు రోజులు తరబడి క్యూల్లో నిలబడుతున్నారు. బస్తా ధర రూ.267 అయినా, బ్లాక్ మార్కెట్‌లో మరో రూ.200 ఎక్కువ ఇచ్చి కొనాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి. PACS, RBKలకు సరైన కేటాయింపులు లేకపోవడమే కాకుండా, మీ పార్టీ నాయకులే ఎరువులను దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు” అని ఆరోపించారు.

అలాగే పంటల ధరల పతనంపై కూడా జగన్ మండిపడ్డారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, అరటి, చీనీ, కోకో, పొగాకు ఇలా అన్నింటికీ గత రెండేళ్లలో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం ఏ జోక్యం చేసుకోలేదని మండిపడ్డారు.

“మా హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకూ అమ్ముడవుతుండేది. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అలాగే చీనీ టన్నుకు మా కాలంలో కనీసం రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.1 లక్ష ధర దక్కేది. కానీ ఇప్పుడు ధరలు కుప్పకూలినా మీరు పట్టించుకోవడంలేదు” అని జగన్ వ్యాఖ్యానించారు.

రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను గుర్తుచేసుకుంటూ – ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు, RBKల ద్వారా నేరుగా ఎరువుల సరఫరా, రైతు భరోసా లాంటి చర్యలతో రైతులకు అండగా నిలిచామని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూలనపెట్టి రైతులను నిరాశలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. “బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అని రైతులు ఇప్పుడు అనుభవిస్తున్నారు” అంటూ ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ తీవ్రంగా మండిప‌డుతూ ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment