మ‌ళ్లీ పేద‌రికంలోకి మ‌హిళ‌లు.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మ‌ళ్లీ పేద‌రికంలోకి మ‌హిళ‌లు.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మహిళల (Women)పై చంద్రబాబు (Chandrababu) మోసపూరిత వైఖరి కొనసాగుతోందని వైఎస్‌ జగన్‌ (YS Jagan) మండిపడ్డారు. ఎన్నికల ముందు సూపర్‌-6, సూపర్‌-7 అంటూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగ‌లో తొక్కార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం పేరుతో మోసం (Fraud) చేశారని ట్విట్టర్ వేదిక‌గా మాజీ సీఎం తీవ్ర స్థాయిలో విమర్శించారు. “అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం, అందులోనూ సవాలక్ష ఆంక్షలు పెట్టడం మోసం కాదా?” అని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ త‌న ట్వీట్‌లో.. “ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్ర‌యాణం పథకం వర్తిస్తోంది. 11,256 బస్సుల్లో 6,700 బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులోనూ 950 నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు వర్తించదంటూ బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన ద్రోహం కాదా?” అని నిలదీశారు. అంతేకాదు, 3 ఉచిత సిలిండర్ల హామీ కూడా అమలు కాలేదని ఆయన విమర్శించారు. మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లు అవ‌స‌రం అయితే.. ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లేన‌ని, మ‌రి సంపూర్ణంగా ఎలా అమ‌లు చేసిన‌ట్లు అని లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

జగన్‌ తన ప్రభుత్వ హయాంలో మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిన పథకాలను గుర్తుచేశారు. ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా లక్షలాది మహిళలకు వేల కోట్ల రూపాయలు నేరుగా అందించామని చెప్పారు. “దేశంలో తొలిసారిగా మేము ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు. మా కాలంలో మహిళలకు స్వర్ణయుగం ఏర్పడింది” అని జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, వైసీపీ ప్ర‌భుత్వ‌ చిత్తశుద్ధికి నిదర్శనమ‌న్నారు.

“కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని చంద్ర‌బాబుపై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అడ్డ‌గోలు హామీలిచ్చి వాటిని అమ‌లు చేయ‌కుండా మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా? అని జగన్‌ ప్రశ్నించారు. “బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ” అంటూ జ‌రుగుతున్న మోసంపై ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment