చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త (YSRCP Activist) మందా సాల్మన్ (Manda Salman) హత్యను (Murder) ఖండిస్తూ జగన్ ట్విట్టర్ (X) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలతో ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు.
“చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?” అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ (Red Book Constitution), ‘పొలిటికల్ గవర్నెన్స్’ (Political Governance)ముసుగులో ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్త, దళితుడు, పేదవాడైన మందా సాల్మన్ హత్యపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.
అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు సొంత గ్రామానికి వెళ్లిన సాల్మన్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపడం దారుణమని జగన్ పేర్కొన్నారు. అంతేకాకుండా హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బదులు, సాల్మన్‌పైనే తప్పుడు కేసులు పెట్టించడం మరింత అమానుషమని మండిపడ్డారు. ఇలాంటి దారుణాలు చేయడానికే అధికారంలోకి వచ్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు.
ఈ ఘటన వైసీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి టీడీపీ నేతలు, కొంతమంది పోలీసులు కలిసి చేస్తున్న రాజకీయ హింసలో భాగమేనని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికార అహంకారంతో వ్యవహరిస్తూ, తమకు నచ్చని వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ బెదిరింపుల కారణంగా పిన్నెల్లి గ్రామం నుంచి వందలాది వైసీపీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదొక్కటే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం సిగ్గులేకుండా ఈ మారణకాండను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా జీవించేలా చూడడం ప్రభుత్వ బాధ్యత కాదా అని జగన్ ప్రశ్నించారు. ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమవడమే కాకుండా, కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆయన ఆరోపించారు.
“హింసా రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా మీరు దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది మరిచిపోకండి” అని జగన్ హెచ్చరించారు. టీడీపీ(TDP) చేతిలో హత్యకు గురైన మందా సాల్మన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.








