సినిమా పరిశ్రమపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనిగెల అనిరుధ్ రెడ్డి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలోనే అత్యధికంగా డ్రగ్స్ యాక్టివిటీ జరుగుతోందని, ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా చెప్పడం లేదని, సాధారణ జనాలే అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సినీ ప్రముఖులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమా రిలీజ్!
సినిమా రంగంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రతి సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి డ్రగ్స్ టెస్ట్ చేయాలనే నిబంధన పెట్టాలని డిమాండ్ చేశారు. హీరోలు ఒకవేళ టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరిస్తే, వారు డ్రగ్స్ తీసుకున్నట్టే భావించాలన్నారు. సినిమా యాక్టర్లందరూ ప్రతి 90 రోజులకు ఒకసారి తప్పనిసరిగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.
“ఖుషీలో పవన్ సారా ప్యాకెట్లు పట్టుకోలేదా?”
ఇటీవల తనపై జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కూడా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాయకులు మద్యం గురించి మాట్లాడితే ఎందుకు రాద్ధాంతం చేస్తారని ప్రశ్నించారు.”సినిమాల్లో తాగితే తప్పు కాదు గానీ, రాజకీయాల్లో మాట్లాడితే తప్పా?” అని నిలదీశారు. గతంలో ‘ఖుషీ’ సినిమాలో పవన్ కల్యాణ్ సారా ప్యాకెట్లను పట్టుకోలేదా? అని ప్రశ్నించారు. అలాగే నందమూరి బాలకృష్ణ సినిమాలో ‘ఏక్ పెగ్ లా’ అంటే తప్పు కాదు గానీ, ఎమ్మెల్యే టేబుల్ పై గ్లాస్ ఉంటే విమర్శలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎవరినీ వ్యక్తిగతంగా తప్పుపట్టడం లేదని, కానీ సమాజంలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.







