అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఉగ్రవాద సంస్థలు పన్నిన ఒక భారీ కుట్ర తాజాగా భగ్నమైంది. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) శిక్షణ పొందిన ఓ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఇవాంకను హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టర్కీలో అరెస్ట్ అయిన సదరు ఉగ్రవాదిని అమెరికాకు అప్పగించడంతో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
సులేమానీ మృతికి ప్రతీకారంగానే స్కెచ్
2020లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ ఖాసిం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. సులేమానీని తన గురువుగా, పితృసమానుడిగా భావించే మహ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాది (32) అనే ఇరాకీ ఉగ్రవాది ఈ ప్రతీకార కుట్రకు తెరలేపాడు. “మా సులేమానీని ట్రంప్ ఎలాగైతే ముక్కలు చేశాడో.. ట్రంప్ ఇల్లు కూల్చడానికి మనం ఇవాంకను చంపాలి” అంటూ అల్-సాది తన అనుచరులతో అన్నట్లు నిఘా వర్గాల నివేదికలు పేర్కొంటున్నాయి.

దొరికిన ఇవాంక ఇంటి బ్లూప్రింట్
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. మే 15న టర్కీలో పట్టుబడిన అల్-సాదిని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఫ్లోరిడాలో ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌కు ఉన్న $24 మిలియన్ల (సుమారు రూ. 200 కోట్లు) విలాసవంతమైన నివాసానికి సంబంధించిన పూర్తి బ్లూప్రింట్ (గృహ నమూనా మ్యాప్) నిందితుడి వద్ద లభించింది.
అంతేకాకుండా, 2021లోనే ఇతడు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఇవాంక నివాస ప్రాంతపు మ్యాప్‌ను షేర్ చేస్తూ అరబిక్‌లో ఒక హెచ్చరిక కూడా పెట్టాడు. “అమెరికన్లారా.. ఈ చిత్రాన్ని చూడండి. మిమ్మల్ని మీ రాజభవనాలు కానీ, సీక్రెట్ సర్వీస్ భద్రత కానీ రక్షించలేవు. ప్రస్తుతం మేము నిఘా, విశ్లేషణల దశలో ఉన్నాము. ప్రతీకారం తీర్చుకోవడం కేవలం సమయంపైనే ఆధారపడి ఉంది.”

అంతర్జాతీయంగా దాడుల పరంపర
అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. అల్-సాది కేవలం ఇవాంకపై కుట్రకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా అమెరికా, యూదుల లక్ష్యాలపై జరిగిన పలు దాడుల వెనుక ఇతడే మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో ఆమ్‌స్టర్‌డామ్‌లోని బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లన్ భవనంపై బాంబు దాడి చేశాడు. ఏప్రిల్‌లో లండన్‌లో ఇద్దరు యూదులపై కత్తితో దాడి చేశాడు. టొరంటోలోని అమెరికా రాయబార కార్యాలయం (కన్సులేట్) వెలుపల జరిగిన కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. అల్-సాది ఇరాన్ ఐఆర్జీసీ (IRGC) తో పాటు, అమెరికా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘కతైబ్ హిజ్బుల్లా’లో కీలక కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇవాంకనే ఎందుకు టార్గెట్ చేశారు?
ట్రంప్ కుటుంబంలో ఇవాంకనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే దానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ఆమె 2009లో జారెడ్ కుష్నర్‌ను వివాహం చేసుకునే ముందు ‘ఆర్థడాక్స్ జుడాయిజం’ (యూదు మతం) లోకి మారడం ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ‘ట్రంప్ 2.0’ ప్రభుత్వంలో ఆమె భర్త జారెడ్ కుష్నర్ ప్రత్యేక రాయబారిగా ఇరాన్‌తో శాంతి చర్చల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడరల్ జైలులో ఒంటరి సెల్‌లో ఉన్న అల్-సాదిపై అమెరికా ప్రభుత్వం తీవ్రమైన ఉగ్రవాద నిర్బంధ చట్టాల కింద విచారణ జరుపుతోంది. దోషిగా తేలితే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.








