వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని గతంలోనే వెలుగు చూసింది.
పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చేందుకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా డిసెంబర్ 29 ,30, 31 తేదీల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ ప్రణాళికను తయారు చేసినట్లుగా సమాచారంతో వార్తలు వెలుగులోకి వచ్చాయి. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా మూడో రోజుల పాటు భేటీ అయ్యారని ఆ వార్తల సారాంశం.
సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతోసహా..
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. వాటితోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు పథకమేసినట్లుగా సమాచారం. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. దీంట్లో భాగంగానే తాజాగా ఐఏఎస్ లు చెరుకూరి శ్రీధర్, అజైన్ జైన్లతో స్టేట్ మెంట్లు రీ రికార్డ్ కు యత్నిస్తున్నారు.