తొమ్మిదేళ్ల వయసులో బాలికలకు వివాహం చేయడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇరాక్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ప్రజల ఆచారాలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, ఆ దేశం ఆమోదించిన ఈ బిల్ మహిళా హక్కులకు ముప్పుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మతాచారాలకు ప్రాముఖ్యతా?
ఇరాక్‌లో ప్రస్తుతం 18 ఏళ్లు పూర్తయిన తర్వాతే అమ్మాయిలకు వివాహం చేసుకోవడానికి అనుమతి ఉండేది. అయితే కొత్తగా అక్కడి ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం, జాఫరీ ఇస్లామిక్ నిబంధనల ఆధారంగా 9 ఏళ్లకే బాలికల పెళ్లికి అనుమతిచ్చారు. ప్రధానంగా షియత్ మతాన్ని అనుసరించే ప్రజలు ఈ చట్టం వల్ల ప్రభావితమవుతారని భావిస్తున్నారు.
ఈ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళల భవిష్యత్తు, హక్కులు మరియు స్వేచ్ఛకు ఇది ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చట్టం గట్టి విమర్శలు ఎదుర్కొంటోంది. గతంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగినప్పటికీ, తాజాగా చట్ట సవరణలతో మరోసారి వివాదం చెలరేగింది.