ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఆడవారిపై అరాచకాలు, హత్యలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. అనంతపురం (Anantapur)లో వరుస ఘటనల నుంచి రాష్ట్రం తేరుకోకముందే కడప జిల్లా జమ్మలమడుగు (Jammalamadugu) మండలం గండికోట (Gandikota) ప్రాంతంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని (Intermediate Girl Student) దారుణ హత్య (Brutal Murder)కు గురికావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని (17) నిన్న కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండికోట ప్రాంతంలో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాలికను గుర్తుతెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. బాలిక లోకేష్ అనే యువకుడితో గండికోటకు వచ్చిందని, అతనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనలపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపణలు వస్తున్నాయి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ, ఆయన సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంటూ రాష్ట్రానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి అనిత ప్రతిపక్ష వైసీపీ నాయకులపై ఆరోపణలు చేయడంలోనే సమయం గడుపుతున్నారని, మహిళల భద్రతపై శ్రద్ధ చూపడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టేందుకు చూపే శ్రద్ధను రాష్ట్ర ప్రజల భద్రతపై చూపడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గండికోట హత్య ఘటన మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు.