యువకుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. కడపలో విషాదం (Video)

యువకుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. కడపలో విషాదం (Video)

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి మరో యువకుడి ప్రాణం తీసింది. కడప జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తాయనే ఆశతో బైక్‌పై విన్యాసాలు చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తుండగా యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

కడపకు చెందిన ముబారక్‌ (20) తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ప్రయత్నించాడు. వేగంగా బైక్ నడుపుతూ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన బైక్ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముబారక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అతనితో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడికి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు రిఫర్ చేసినట్లు సమాచారం.

ఈ ఘటనతో ముబారక్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోషల్ మీడియా రీల్స్ మోజు యువత ప్రాణాలకే ప్రమాదంగా మారుతోందని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపై విన్యాసాలు చేసి రీల్స్ తీయడం ప్రాణాంతకమని, చట్టపరమైన చర్యలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment