ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాన్ఫామ్ చేసేసింది. మీడియా ఛానళ్ల ప్రసారాల ప్రకారం జగన్ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వైఎస్ జగన్ ఆదేశించినట్లుగా సమాచారం. ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారని, సూపర్ సిక్స్, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఉంటుంది. హోదా ఇవ్వాలని వైసీపీ కోరుతోంది. దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తోంది. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో పలు సందర్భాల్లో మీడియా ప్రతినిధులకు వివరించిన విషయం తెలిసిందే.