భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారతీయ ప్లేయర్‌ల జాబితాలో ఆమె స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.
ఇంగ్లండ్ మహిళా జట్టుతో (England Women vs India Women) జరిగిన రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది. భారత మహిళా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌తో స్మృతి మంధాన తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.
ఇప్పటివరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా, స్మృతి మంధాన కూడా ఈ జాబితాలో చేరింది. ఆమె ఇప్పటివరకు ఆడిన 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 124కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 3873 పరుగులు సాధించింది. మహిళల టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల పరుగుల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది.