శ్రీకాకుళం జిల్లా RGUKT (ఐఐఐటీ) క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపింది. కాలేజీలోని సీనియర్ల దారుణ వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఒక యువ విద్యార్థి బలవన్మరణం చెందిన ఘటన విద్యార్థి వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్తిపాటి సృజన్ అనే EEE థర్డ్ ఇయర్ విద్యార్థి ఒక సహ విద్యార్థి అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంతో ఫోర్త్ ఇయర్‌కు చెందిన ఎనిమిది మంది సీనియర్లు అతడిని ర్యాగింగ్ పేరుతో మొన్న అర్ధరాత్రి తమ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడిపై దాదాపు నాలుగు గంటలపాటు దారుణంగా కొట్టడంతోపాటు చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం.
ఈ వేధింపుల వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన సృజన్, ఉదయం తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన క్యాంపస్ మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. సృజన్ మృతితో ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్‌లో పాల్గొన్న ఎనిమిది మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. అలాగే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సృజన్‌కు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్‌లో భద్రత, యాంటీ-ర్యాగింగ్ పర్యవేక్షణపై ప్రశ్నార్థకాలు ఏర్పడ్డాయి.








