భారత (India) స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన సత్తాను చాటాడు. ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ (Anderson-Tendulkar) ట్రోఫీ (Trophy)లో అద్భుతమైన ప్రదర్శనతో, సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించాడు.
674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ హైదరాబాద్ పేసర్ టెస్టు బౌలర్ల టాప్-15లో చోటు సంపాదించడం ఇదే మొదటిసారి.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో దుమ్మురేపిన సిరాజ్
ఇంగ్లాండ్ (England)తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ అంచనాలకు మించి రాణించాడు. ముఖ్యంగా ఓవల్ టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో ఏకంగా 9 వికెట్లు పడగొట్టి భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు సాధించి, రెండుసార్లు ఐదు వికెట్ల హాల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రసిద్ధ్ కృష్ణకు కూడా మెరుగైన ర్యాంకు
ఓవల్ టెస్టు (Oval Test)లో సిరాజ్‌తో పాటు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ధ్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐదో టెస్టులో మొత్తం 8 వికెట్లు పడగొట్టి తన కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కగిసో రబాడ రెండో స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మళ్లీ టాప్-5లోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో అద్భుతమైన సెంచరీ సాధించి ఈ ర్యాంకును అందుకున్నాడు.
అదేవిధంగా, ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు.