ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. కానీ ఈ జట్టులో ఒక్క భారత ఆటగాడి పేరు లేకపోవడం భారత క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత ఏడాది భారత్ వన్డే ఫార్మాన్స్ చాలా పేలవంగా ఉండడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఎందుకు చోటు దక్కలేదు?
2024లో భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. అందులో కూడా ఒక్క మ్యాచ్‌ను గెలవకపోవడం బాధాకరం. శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోవడం భారత ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కనందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఇది 2004 నుండి భారత్ ఆటగాళ్లకు ICC వన్డే జట్టులో ప్రాతినిధ్యం లభించకపోవడం రెండో సారి.
2024 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్
ఈ జట్టులో శ్రీలంక నుంచి నలుగురు, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెరి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. లంక కెప్టెన్ చరిత్ అసలంక ఈ జట్టుకు నాయకుడిగా ఎంపికయ్యాడు. అతని 2024 ప్రదర్శనలో 16 వన్డేల్లో 605 పరుగులు చేయడం పెద్ద పాత్ర పోషించింది.
జట్టు సభ్యులు..
సేమ్ అయూబ్, రహ్మనుల్లా గుర్బాజ్, పతుమ్ నిస్సంకా, కుసల్ మెండిస్ (WK), చరిత్ అసలంక (C), షెర్ఫైన్ రుదర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఓమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, ఏఎమ్ గజన్‌ఫర్.
మహిళల టీమ్‌లో భారత ప్లేయర్లు
మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో స్మృతి మందాన, దీపిక శర్మ ఎంపిక కావడం భారతీయులకు కొంత ఊరట కలిగించింది. అయితే, వన్డే పురుషుల జట్టులో మనోళ్లు లేకపోవడం నిరాశజనకమే.
టెస్ట్ ఫార్మాట్‌లో మూడు చోట్లు
టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. టెస్ట్ క్రికెట్‌పై టీమిండియా దృష్టి పెట్టడం మాత్రం కనిపిస్తోంది.