అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad) వాసి దుర్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్ ఎం.ఎస్ మక్తా ప్రాంతానికి చెందిన వాజిద్ నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా (USA) వెళ్లాడు. సాధారణ కుటుంబానికి చెందిన వాజిద్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో తన చదువును కొనసాగిస్తున్నాడు.
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వాజిద్ గతంలో ఖైరతాబాద్ డివిజన్‌లో కాంగ్రెస్ యువజన నాయకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ మైనారిటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషాదకర ఘటనపై సికింద్రాబాద్ ఎంపీ అనిల్ కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.