పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల సేకరణపై ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలపడానికి బయల్దేరిన హరీష్ రావును పోలీసులు అప్ప జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలు వినడానికి వెళ్లినా అడ్డుకోవడం దురదృష్టకరమని, ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో సుమారు 1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూములు ఇవ్వబోమని వారు రిలే దీక్షలు కొనసాగిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై హరీష్‌రావు విమర్శలు గుప్పిస్తూ, భూముల స్వాధీనం పేరుతో పేదలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముందస్తు అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేది లేదని, రైతుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.







