సాధారణంగా టాస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం అనేది క్రికెట్‌లో సంప్రదాయం. కానీ భారత్-పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చర్యే పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం ఉండటంతో, ఈసారి ఆ ఆనవాయితీని పక్కన పెట్టారు. టాస్ అనంతరం సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ ఆగా ఇద్దరూ ఒక్కరికొకరు చూడకుండా, కరచాలనం చేయకుండా చెరో వైపు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు చేతులు కలుపకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లారు.
ఇదంతా ఎందుకంటే, ఇటీవల టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో జరిగిన ఒక ఘటన. ఆ సందర్భంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీకి సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్‌షేక్ ఇవ్వడం భారత అభిమానులకు అసంతృప్తి కలిగించింది. ఆ ఒక్క దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అభిమానులు సూర్యను, బీసీసీఐని విమర్శిస్తూ పోస్టులు చేశారు. ఆ అనుభవం కారణంగా ఈసారి సూర్యకుమార్ కూడా మరింత జాగ్రత్తపడ్డాడు.