దావోస్ (Davos) వేదికగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేస్తున్నది పెట్టుబడుల ప్రయత్నం కాదని, పూర్తిగా రాజకీయ మార్కెటింగ్ మాత్రమేనని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ మేనేజ్మెంట్లో చంద్రబాబు యూనిక్ పీస్ అంటూ ఎద్దేవా చేసిన ఆయన, లోకేష్(Lokesh)కు బ్యాక్ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
తనపై లోకేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసిన గుడివాడ అమర్నాథ్, దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. జ్యూరిక్ (Zurich) ప్రపంచ వేదిక సాక్షిగా తాను మాట్లాడినట్లు ఒక్క విజువల్ అయినా చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. నిరూపించలేకపోతే లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు మార్కెటింగ్ పిచ్చి గురించి తాము మాట్లాడితే, చలివల్ల దావోస్‌కు వెళ్లలేదన్నట్టు తమపై తప్పుడు లోకేష్ ప్రచారం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతగా ఉండాల్సిన బాధ్యత మరిచి, కొడుకుగా ఫేక్ న్యూస్ ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు.
తాను గతంలో ఐటీతో పాటు ఐదు శాఖల మంత్రిగా పనిచేశానని గుర్తు చేసిన అమర్నాథ్, వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022 మే నెలలో దావోస్ పర్యటన జరిగిందని తెలిపారు. 2023 జనవరిలో మరోసారి దావోస్‌కు ఆహ్వానం వచ్చినప్పటికీ, ప్రజాధనం ఖర్చు చేయడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ వచ్చే ఏడాది చూద్దామని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అయితే దీనిపైనా లోకేష్, ఆయన బృందం అసత్య ప్రచారం చేసి, అసలు ఆహ్వానమే రాలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
రాష్ట్ర అవసరాలు, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని లోకేష్‌కు హితవు పలికిన గుడివాడ అమర్నాథ్, కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో వీటన్నింటికీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.







