జీఎస్టీ (GST) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ (Country Economic System)లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కొత్త సంస్కరణలు ప్రజలకు మరింత ఉపశమనం కలిగిస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. 2017కి ముందు దేశవ్యాప్తంగా 17 రకాల పన్నులు, 8 సెస్సులు ఉండేవని, వాటిని రద్దు చేసి ఒకే పన్ను విధానాన్ని, నాలుగు స్లాబ్‌లను మాత్రమే అమలు చేశామని వివరించారు. అప్పుడు 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఉండగా, ఇప్పుడు అది 1.51 కోట్లకు పెరిగిందన్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్లు ఆదాయం వస్తే, 2025లో అది రూ.22.08 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు.
ఈ వస్తువుల కొనుగోలులో ఊరట..
- నాలుగు శ్లాబ్‌లను రెండు శ్లాబ్‌లకు తగ్గించారు.
- 12% స్లాబ్‌లో ఉన్న వస్తువుల్లో 99%ను 5% స్లాబ్‌లోకి తెచ్చారు.
- 28%లో ఉన్న సిమెంట్‌ను 18%కి, అలాగే 28%లో ఉన్న దాదాపు 90% వస్తువులను 18% స్లాబ్‌లోకి మార్చారు.
- కారు, ఫ్రిజ్, ఏసీ వంటి వస్తువులను 28% నుంచి 18%కి తీసుకొచ్చారు.
- పాలు, పెరుగు వంటి నిత్యావసరాలను సున్నా శాతం పన్నుకి తీసుకొచ్చారు.
- పప్పులు, ఉప్పు, చింతపండు వంటి వస్తువులను 12% నుంచి 5%కి తగ్గించారు.
- హెయిర్ ఆయిల్, షాంపూ, నెయ్యి, వెన్న, వంట పాత్రలపై కూడా పన్ను తగ్గించబడింది.
- రైతుల కోసం ఫెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై పన్ను తగ్గించారు.
- మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్ను పూర్తిగా ఎత్తివేశారు.
- జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలాన్నిస్తాయని, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.








