కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నేడు ఉదయం 11 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం పన్ను వ్యవస్థలో కీలక మార్పులకు వేదిక కానుంది. ముఖ్యంగా జీఎస్టీ శ్లాబ్‌లలో భారీ మార్పులు చేయనున్నట్లు అంచనా. ప్రస్తుతం అమల్లో ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేసి, ఆ కేటగిరీల్లోని ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం శ్లాబ్‌ల్లోకి మార్చే ప్రతిపాదన కౌన్సిల్ ముందుకు రానుంది.
లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు వంటి వాటిపై 40 శాతం జీఎస్టీ కొనసాగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ ఉపసంఘం సిఫారసు చేసింది. ఈ నిర్ణయాలకు ఆమోదం లభిస్తే, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పయ్యావుల కేశవ్, భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.








