అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గోవాడ చెరకు రైతుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ సభ్యులతో పాటు రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రూ.35 కోట్ల విడుదలలో జాప్యం
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం తక్షణం రూ.35 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం నిధులు విడుదలలో జాప్యం చేస్తోంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు, కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బకాయిలు చెల్లించాలని రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పంట పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయనట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నాటికి పూర్తయ్యే క్రషింగ్.. ప్రస్తుతం సంక్రాంతి దాటి ఉగాది దగ్గరకు వస్తున్నా.. పూర్తవ్వకపోవడంతో చెరకు ఎండిపోయి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇటీవల అధికార పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేస్తామని హామీ ఇచ్చినా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు, కార్మికులు రోడ్డెక్కారు.

అప్పుల్లో ఫ్యాక్టరీ
2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో షుగర్ ఫ్యాక్టరీ పాలకమండలి సభ్యులుగా వ్యవహరించిన వారు సుమారు రూ. 150 కోట్ల అప్పుల చేసి, ఫ్యాక్టరీని అప్పుల ఊబిలో నెట్టివెళ్లిపోయారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా చెరకు పరిశ్రమను ఆదుకునేందుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాక్టరీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది.
ఉద్యమిస్తాం.. బొత్స
ఇటీవల చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని శాసనమండలి విపక్ష నేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పరిశీలించారు. రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని, లేదంటే చెరకు రైతుల తరఫున వైసీపీ ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైఎస్ జగన్ రూ. 90 కోట్లతో ఆదుకున్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.