భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ మ్యాచ్ (Cricket Match) అంటే సాధారణంగా హోరాహోరీగా ఉంటుంది. కానీ ఇటీవల ఆసియా కప్ (Asia Cup) 2025లో జరిగిన మ్యాచ్‌లో ఆ ఉత్సాహం కనిపించలేదు. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో చాలామంది అభిమానులు నిరాశ చెందారు. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
తాను భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను కేవలం మొదటి 15 ఓవర్లు మాత్రమే చూశానని, ఆ తర్వాత మ్యాచ్ చప్పగా అనిపించడంతో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ చూశానని గంగూలీ తెలిపారు. “ఇటీవలి కాలంలో పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వడం లేదు. అన్ని మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతున్నాయి. భారత్-పాక్ మ్యాచ్‌ల కంటే భారత్-ఆస్ట్రేలియా, భారత్-ఇంగ్లండ్, భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చివరికి భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పుడు భారత్-పాక్ మ్యాచ్‌లకు ఉన్నంత హైప్ అవసరం లేదు” అని దాదా అసహనం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు లేరని, బ్యాటింగ్, బౌలింగ్‌లలో పస కొరవడిందని గంగూలీ అన్నారు. మరోవైపు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినా భారత జట్టు బాగా రాణిస్తోందని ప్రశంసించారు. “ఆసియా కప్ 2025లో భారత్ అన్ని జట్ల కంటే ఎంతో ముందంజలో ఉంది. టీమిండియా ఎప్పటికీ అత్యుత్తమ జట్టు” అని ఆయన పేర్కొన్నారు.







