సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద వీరంగం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను కార్యాలయంలో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం, దానికి బీఆర్ఎస్ శ్రేణులు అడ్డు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
అసలేం జరిగిందంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంచాలని డిమాండ్ చేస్తూ డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరారు. మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయంలోకి వెళ్లిన నాయకులు అక్కడ సీఎం ఫొటోను గోడకు ప్రతిష్టించారు. అయితే, కాంగ్రెస్ నాయకులు వెళ్లిన కొద్దిసేపటికే గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనపై ఇరు పార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులే పథకం ప్రకారం క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఫొటోను మాత్రమే పెట్టామని, దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
కేసీఆర్ ఫొటో వర్సెస్ రేవంత్ ఫొటో
కాంగ్రెస్ నాయకులు వెళ్లిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు భారీగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను అక్కడ నుంచి తొలగించి, అదే స్థానంలో మళ్లీ మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఫొటోను ప్రతిష్టించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు.








