చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి కారణం..
అర్ధరాత్రి 2 గంటల సమయంలో తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఆగి ఉన్న టిప్పర్‌ను తప్పించబోయిన బస్సు అదుపు తప్పింది. వేగం ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు.
సహాయక చర్యలు వేగవంతం
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మరికొంతమందిని మెరుగైన వైద్యం కోసం సీఎంసీ వేలూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మరింత కఠిన నియంత్రణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు వ్యాఖ్యానించారు.