మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ (92) క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న‌, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా మ‌న్మోహ‌న్ సింగ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ చ‌నిపోయిన‌ట్లుగా రాబ‌ర్ట్‌ వాద్రా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ ఎయిమ్స్ ఆస్ప‌త్రికి చేరుకోనున్నారు. సీడ‌బ్ల్యూసీ మీటింగ్స్ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క బెళ‌గావిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి బ‌య‌ల్దేరారు.

1932 సెప్టెంబ‌ర్ 26న అవిభ‌క్త భార‌త్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జ‌న్మించిన మ‌న్మోహ‌న్ సింగ్ దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాలించిన ప్ర‌ధాన‌మంత్రుల్లో ఒక‌రిగా నిలిచారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు ప్ర‌ధానమంత్రిగా ఆయ‌న దేశానికి సేవ‌లు అందించారు. 1998 నుంచి 2004 వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. 1991 నుంచి 1996 వ‌ర‌కు పీవీ న‌ర్సింహ‌రావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా సేవ‌లు అందించారు. ఎన్నో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. ఐదుసార్లు అస్సోం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1991 అక్టోబ‌ర్‌లో రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టారు. మ‌న్మోహ‌న్ సింగ్ హ‌యాంలోనే ఉపాధి హామీ ప‌థ‌కం, ఆర్టీఐ చ‌ట్టం రూపుదిద్దుకున్నాయి. 2024 ఏప్రిల్‌లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. మన్మోహ‌న్‌కు భార్య గురుచ‌ర‌ణ్‌కౌర్‌, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోటు అని, దేశం ఒక మంచి నాయ‌కుడిని కోల్పోయింద‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ ప్ర‌ధాని మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాంగ్రెస్ అగ్ర‌శ్రేణి నేత‌లు ఒక్కొక్క‌రుగా ఢిల్లీ ఎయిమ్స్ ఆస్ప‌త్రికి చేరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment