బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న బీఆర్ఎస్ పార్టీపై, కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీది నాలుకా, తాటి మట్టా, కడుపునకు అన్నం తింటున్నావా..? లేక గడ్డి తింటున్నావా..? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దశాబ్దం పాటు కేసీఆర్ కుటుంబంతో మెలిగి, వారిని పొగిడిన వ్యక్తి, ఇవాళ వారిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అన్నారు. 1994లో నీ ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని అని కడియంను ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి ఎమ్మెల్యే కడియం తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు. కవితను అరెస్టు చేసిన రోజు రోడ్డుపై బైఠాయించి కవితను విడుదల చేయాలని ధర్నా చేసింది నువ్వు కాదా..? కడియం శ్రీహరిని ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరిన నీ చర్యను చూసి బీఆర్ఎస్ వాళ్లే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా చీదరించుకుంటున్నారన్నారు. ఇంకోసారి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే ముందు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 1100 మంది దళితులకు దళిత బంధు రాకుండా అడ్డుకున్న వ్యక్తి కడియం శ్రీహరి అని తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీహరి దళిత ద్రోహి, దళితుల పాలిట రాబందు అంటూ దూషించారు. టీడీపీలో, బీఆర్ఎస్‌లో మంత్రి పదవులు అనుభవించి అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడని విమర్శించారు.