---Advertisement---

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. – కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. - కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌
---Advertisement---

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆరోపించారు. పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలే తప్ప ట్రస్ట్‌ మోడల్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌లోకి మార్చడం తగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. గుంటూరులో మంగ‌ళ‌వారం మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అనేది పేదల కోసం రూపుదిద్దుకున్న సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, ప్రజల జీవితాలను రక్షించే గొప్ప విధానం అని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు..
2019లో వైసీపీ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పెద్ద సంస్కరణలు తీసుకువచ్చిందని మాజీ మంత్రి విడుద‌ల ర‌జిని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ప్రొసీజర్లను 1,059 నుంచి 3,257కి పెంచారని, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను 919 నుంచి 2,300కి పెంచి, పథకం కవరేజ్‌ను రూ.25 లక్షల వరకు విస్తరించారని గుర్తుచేశారు. కరోనా వ్యాప్తి సమయంలో కూడా పథకంలో 10 కొత్త ప్రొసీజర్లను చేర్చారని వివ‌రించారు. 2019లో చంద్రబాబు దిగిపోతూ, ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.632 కోట్లు బకాయి పెట్టిపోతే ఆ మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు.

6 నెలల్లోనే నిర్వీర్యం
టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్లు బకాయి పెట్టడంతో, అవన్నీ వైద్యాన్ని నిలిపేశాయని మాజీ మంత్రి విడ‌ద‌ల రజిని అన్నారు. మరోవైపు హైబ్రిడ్‌ విధానంలో పథకాన్ని అమలు చేస్తామంటూ, ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించే పని మొదలుపెట్టారని, ఇది నిరుపేద రోగులకు శాపంగా మారనుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద చేసిన ఖర్చు దాదాపు రూ.13,500 కోట్లు కాగా, 2014–19 మధ్య అందు కోసం టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.5,100 కోట్లు మాత్రమేన‌ని వివ‌రించారు.

హైబ్రిడ్‌ విధానం ప్రజలకు శాపం
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ మోడల్‌ను ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించడం పేదలపై అన్యాయం చేస్తోందన్నారు. మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో హైబ్రిడ్‌ విధానం విఫలమైందని, కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా చంద్ర‌బాబు ప్రభుత్వం అదే దారిలో నడవడంపై ఆమె మండిపడ్డారు. కూట‌మి ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన పెద్ద ఉద్యమానికి దిగుతామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్‌ మోడల్‌లో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తామని విడదల రజని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment