15 ఏళ్ల బాలికపై (15‑year‑old Girl) అత్యాచారం(Rape), లైంగిక వేధింపులకు (Sexual Harassment) ఉద్దేశించిన గ్రూమింగ్ చేసిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్ (Aaron Summers) దోషిగా తేలాడు. ఈ కేసులో తనపై నమోదైన రెండు ప్రధాన అభియోగాలను స్వయంగా అంగీకరించినట్లు ఆస్ట్రేలియా మీడియా (Australia Media) వెల్లడించింది. దీంతో అతడికి శిక్ష ఖరారైనట్టే కాగా, తుది శిక్షను కోర్టు ఆగస్టులో ప్రకటించనుంది. నేరాల తీవ్రత దృష్ట్యా అతడికి దీర్ఘకాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. 2018లో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా 15 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్న సమ్మర్స్, అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అసభ్యకరమైన విషయాలకు ప్రేరేపించే ఉద్దేశంతో గ్రూమింగ్ చేసిన ఆరోపణలను కూడా కోర్టులో అంగీకరించాడు. సమ్మర్స్ తరఫు న్యాయవాది అతడు అప్పట్లో తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నాడని, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు.
ఇదిలా ఉంటే, ఆరోన్ సమ్మర్స్‌కు ఇలాంటి ఆరోపణలు కొత్తవి కావు. 2021లో పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం, వాటిని ఇతరులకు పంపిణీ చేయడం వంటి కేసుల్లో కూడా అతడు దోషిగా తేలి జైలు (Jail) శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు అతడిని మళ్లీ జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే వేగవంతమైన పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సమ్మర్స్ కెరీర్.. వరుస లైంగిక నేరాలతో పూర్తిగా ముగిసిపోయింది.








