ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) మరణం నమోదైంది. ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో ఆందోళనలో ఉన్న ప్రజలను ఈ వార్త భయభ్రాంతులకు గురిచేస్తోంది. జీబీఎస్ బారినపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆదివారం సాయంత్రం మరణించింది. మృతురాలు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఆలసందలపల్లికి చెందిన మహిళగా గుర్తించారు.
రెండ్రోజుల క్రితం జీబీఎస్ వైరస్ సోకిన లక్షణాలతో అలసందలపల్లికి చెందిన మహిళ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతిచెందినట్లుగా తెలుస్తోంది. గుంటూరు ఆస్పత్రిలో ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన నలుగురికి చికిత్స కొనసాగుతుండగా, వారిలో ఇద్దరికి ఐసీయూ చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి.
వైరస్ లక్షణాలు..
గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ సోకిన వారి శరీరమంతా తిమ్మిర్లుగా అనిపిస్తుంది. కండరాల్లో శక్తి క్షీణించినట్లుగా అనిపించడం, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. సకాలంలో ట్రీట్‌మెంట్ అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యలు తెలుపుతున్నారు.