వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన ఇంటి సమీపంలోని గార్డెన్‌లో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రెండుసార్లు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చినప్పటికీ, ఈ ఘటన వెనుక ఆకతాయిల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా, దీనిపై భద్రతా లోపమే కారణమని పార్టీ ఆరోపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ భద్రతపై నిర్లక్ష్యం పెరుగుతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ భద్రతపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల లోకేశ్ బర్త్‌డే సందర్భంగా టీడీపీ కార్యకర్తలు జగన్ ఇంటి ముందు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సెక్యూరిటీ సిబ్బందిని భారీగా కుదించింది. మాజీ సీఎంకు కేటాయించిన కాన్వాయ్‌కి కూడా మరమ్మతులకు గురైన వాహనాలను ఇచ్చారు. ఈ విషయం గతంలో జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా బయటపడింది. ప్రభుత్వం కేటాయించిన వాహనం మోరాయించడంతో జగన్ ప్రైవేట్ వాహనంలో వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్