సర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీ కోసం కన్న కూతురినే చంపిన తండ్రి

సర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీ కోసం కన్న కూతురినే చంపిన తండ్రి

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే దుగ్ధ‌ ఓ తండ్రిని కసాయిగా మార్చింది. ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారడంతో కన్న కూతురినే హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ శివారులోని డి 46/8 కెనాల్‌లో బాలిక మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, ఇది పక్కా హత్యగా నిర్ధారించారు.

ఎన్నికల నిబంధనే హత్యకు కారణం
పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముక్కెడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండు రంగ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధన ఉండటంతో అతడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు, ప్రస్తుత గ్రామ సర్పంచ్ గణేష్ షిండేకు చెప్పాడు. రాజకీయ ఆశలు నెరవేరాలంటే అడ్డుగా ఉన్న పెద్ద కూతురిని తొలగించాలన్న దుర్మార్గ ఆలోచనకు పాండురంగ దిగజారాడు.

కన్న కూతురిపై కిరాతక హత్య
ప్లాన్ ప్రకారం తన పెద్ద కూతురిని కెనాల్ వద్దకు తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజకీయ పదవుల కోసం తండ్రి ఇంతటి క్రూరత్వానికి పాల్పడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి, హత్యకు పాల్పడ్డ బాలిక తండ్రి పాండురంగతో పాటు ఈ నేరానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు భావిస్తున్న ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేను కూడా అరెస్టు చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment