పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. ఐపీఎస్ అధికారిగా యూనిఫాంలో వచ్చి హడావిడి చేసిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కాదని తేలింది. ప్రస్తుతం నకిలీ ఐపీఎస్‌గా వచ్చిన సూర్యప్రకాశ్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
ఎవరు ఈ నకిలీ ఐపీఎస్?
సూర్యప్రకాశ్ విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతేడాదే ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యానని, ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నానని స్థానికులకు చెప్పినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ట్రైనింగ్ మధ్యలో ప్రత్యేకంగా వచ్చానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సూర్యప్రకాశ్ అక్కడున్న సిబ్బందితో సెల్ఫీ ఇస్తూ, ఫొటోలు దిగుతూ నానా హంగామా సృష్టించాడు.
కొనసాగుతున్న విచారణ..
విజయనగరం పోలీసులు సూర్యప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా ఎలా నటించాడు? ఎలాంటి ఉద్దేశాలతో ఈ చర్యకు పాల్పడ్డాడు? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.