ఉత్తరాఖండ్ (Uttarakhand)కు చెందిన బీజేపీ (BJP) మాజీ ఎమ్మెల్యే (Former MLA) సురేష్ రాథోడ్ (Suresh Rathore) రెండో వివాహం, సోషల్ మీడియాలో ఆయన ప్రేమ విన్యాసాలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సహరన్‌పూర్ (Saharanpur) నటి ఊర్మిళ సనావర్ (Urmila Sanawar)ను మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకోవడం, అలాగే రీల్స్‌లో బహిరంగంగా ప్రేమ(Love)ను వ్యక్తం చేయడం విమర్శలకు దారితీశాయి.
వివాదానికి కారణం
లేటు వయసులో ఘాటు ప్రేమతో మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ చిక్కుల్లో పడ్డారు. నటి ఊర్మిళ సనావర్‌ను రెండో వివాహం (Second Marriage) చేసుకోవడం, ఆమెతో కలిసి ఇష్టారీతిన రీల్స్(Reels) చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోవడంపై ఆయన పార్టీ సీరియస్ అయింది. ముఖ్యంగా, సనావర్‌కు మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తపరిచిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోల వల్ల సురేష్ రాథోడ్ జంటతో పాటు బీజేపీ పార్టీ(BJP Party)పై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ అధిష్టానం సురేష్ రాథోడ్‌కు క్రమశిక్షణా రాహిత్యంపై నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లో స్పందించాలని ఆదేశించింది.
యూనిఫాం సివిల్ కోడ్ ప్రభావం
ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం బహుభార్యత్వం చెల్లదు. అయితే, సురేష్ రాథోడ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటిని పెళ్లి చేసుకోవడం ఈ చట్టానికి విరుద్ధంగా మారింది. విపక్షాలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ స్పందించక తప్పలేదు. అయితే, సురేష్ రాథోడ్ తన వాదన వినిపిస్తూ, నటి సనావర్‌ను 2021లోనే నేపాల్(Nepal)లో పెళ్లి చేసుకున్నానని, అప్పటికి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలులో లేదని చెబుతున్నారు.
సురేష్ రాథోడ్ రాజకీయ, వ్యక్తిగత జీవితం
సురేష్ రాథోడ్ 2017 నుంచి 2022 వరకు హరిద్వార్‌లోని జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2022 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నటితో సహజీవనం చేస్తూ, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడం, మీడియా ముందు ప్రపోజ్ చేసుకోవడంతో తీవ్ర చిక్కుల్లో పడ్డారు.