హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా భూకంపంతో కంపించింది. మంగళవారం ఉదయం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ కంపనాల ప్రభావం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కొన్ని సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో, ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్ పరిధిలోని మెట్ఖాన్ గూడ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు.
ఉదయం భారీ శబ్దంతో..
మంగళవారం ఉదయం సుమారు 10:10 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోవడంతో పాటు, కొన్ని చోట్ల నేలపై పడిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమిగూడారు. భూకంప భయంతో స్థానికంగా ఉన్న పలు విద్యా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా స్కూల్ యాజమాన్యాలు తక్షణమే సెలవులు ప్రకటించాయి. మెట్ఖాన్ గూడలోని ప్రభుత్వ పాఠశాలలో బెంచీలపై ఉన్న జ్యామెట్రీ బాక్సులు కిందపడినట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు.
మెట్ఖాన్ గూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సెక్యూరిటీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియోల్లో భూమి కంపించడంతో పాటు వస్తువులు కదిలినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా భూకంపమేనా? లేక ఎక్కడైనా పేలుడు పదార్థాల వల్ల వచ్చిన శబ్దమా? అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా భూకంపమని ధ్రువీకరించే ప్రకటన విడుదల కాలేదు. అయితే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు మెట్ఖాన్ కాలనీకి చేరుకుని ఘటనపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూకంప తీవ్రత, కేంద్ర బిందువు, కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్