అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన సమావేశం (Trump Zelenskyy Meeting) అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వైట్ హౌజ్(White House)లోని ఓవల్ ఆఫీస్ వేదికగా జరిగిన ఈ భేటీలో వాగ్వాదం మరింత వేడెక్కింది. ఇరువురు నేతలు ఒకరి మాటలకు మరొకరు ప్రతిస్పందిస్తూ, అంతర్జాతీయ మీడియా ముందే గట్టి గట్టిగా మాట్లాడుకోవడం సంచలనంగా మారింది.
జెలెన్ స్కీ ఉక్రెయిన్(Ukraine) రక్షణ కోసం అమెరికా మద్దతు కావాలని గట్టిగా డిమాండ్ చేయగా, ఖనిజ ఒప్పందంపై సరైన నిర్ణయం రాకపోవడంతో చర్చలు అనూహ్యంగా ముగిశాయి. సమావేశం ముగిసిన తర్వాత జెలెన్ స్కీ ప్రతినిధి బృందాన్ని వైట్ హౌజ్‌ను వీడాలని కోరినట్లు సమాచారం.
సమావేశంలో జెలెన్ స్కీ తీరును ట్రంప్(Trump) తీవ్రంగా విమర్శించారు. “మీరు మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారు” అని వ్యాఖ్యానించారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా శాంతి కోసం దౌత్యమే మార్గమని చెప్పగా, దీనికి జెలెన్ స్కీ(Zelenskyy) అసహనం వ్యక్తం చేశారు. “మీరు ఎలాంటి దౌత్యం గురించి మాట్లాడుతున్నారు? మీ ఉద్దేశం ఏమిటి?” అంటూ ప్రశ్నించారు. ఈ భేటీ అనంతరం జరగాల్సిన డిన్నర్ సమావేశం కూడా రద్దయింది. క్యాబినెట్ గదిలో ఉన్న భోజన వస్తువులను తొలగించారని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు
ట్రంప్ ఈ సంఘటనపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, “జెలెన్ స్కీ శాంతికి సిద్ధంగా లేరు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు, జెలెన్ స్కీ అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉక్రెయిన్ భద్రతకు హామీ లభించే వరకు రష్యాతో శాంతి చర్చల్లోకి వెళ్లమని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై యూరప్ దేశాలు విభిన్నంగా స్పందించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ జెలెన్ స్కీకి మద్దతు ప్రకటించగా, రష్యా నేతలు మాత్రం తప్పుపట్టారు.