తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు (Dil Raju), పంపిణీదారుగా కూడా మంచి పట్టున్న వ్యక్తి. నైజాం ప్రాంతంలో థియేటర్ల మీద ఆయనకున్న పట్టు తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ'(OG) చిత్రాన్ని ఈ ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది నిర్మాతగా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
కోలీవుడ్‌పై మళ్లీ చూపు
ప్రస్తుతం దిల్ రాజు చేతిలో విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా తప్ప, పెద్ద హీరోల చిత్రాలు ఏవీ లేవు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టారు. గతంలో కోలీవుడ్ స్టార్ విజయ్‌తో నిర్మించిన ‘వారసుడు’ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఉత్సాహంతో మరో తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్(Ajith Kumar)తో సినిమా నిర్మించాలని యోచిస్తున్నారని సమాచారం.
చర్చలు పురోగతిలో: అజిత్, దిల్ రాజు మధ్య ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నాయట. అజిత్ ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) విజయం తర్వాత అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)తో తన తదుపరి చిత్రం చేయనున్నారు. ఆ తర్వాత హనీఫ్ అదేని దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం దిల్ రాజు అజిత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
నిర్మాణ బాధ్యతలు: అన్నీ కుదిరితే, ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. అయితే, అజిత్ ఇటీవల భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు అజిత్‌ను ఎలా ఒప్పిస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.







