‘విశాఖను రాజధాని చేస్తే అప్పుల భారం తగ్గేది’ – సమాజ్‌వాదీ ఎంపీ

‘విశాఖను రాజధాని చేస్తే అప్పుల భారం తగ్గేది’ - సమాజ్‌వాదీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం జరుగుతున్న భూసేకరణ, భారీ అప్పులపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026పై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విశాఖే సరైన ఎంపిక -ధర్మేంద్ర యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం ఇప్పటికే అన్ని హంగులతో అభివృద్ధి చెందిన నగరం. దాన్ని రాజధానిగా చేసి ఉంటే సహజంగా ఉండేది. కొత్తగా వేల ఎకరాల భూమి సేకరించాల్సిన అవసరం ఉండేది కాదు. అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేయడం వల్ల రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడుతుందని, అదే విశాఖ అయితే ఇంత ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.

ల్యాండ్ పూలింగ్ వల్ల కేవలం పెద్దలకే లాభం జరుగుతుందని, అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రైతులకు నాలుగు రెట్ల నష్టపరిహారం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని ఎస్పీ తరపున డిమాండ్ చేశారు.

టీడీపీని నిలదీసిన అర్వింద్ సావంత్
ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్ సావంత్ మాట్లాడుతూ.. గతంలో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని గట్టిగా కోరింది. అప్పుడు శివసేన, టీడీపీ, ఎన్డీయే కలిసి ఉన్నాయి. ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాలని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. ఏపీ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు.

పార్లమెంట్‌లో ఏపీ రాజధాని బిల్లుపై జరుగుతున్న చర్చలో విపక్ష ఎంపీలు విశాఖపట్నం అనుకూలతను, ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణ వ్యయంపై ధర్మేంద్ర యాదవ్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment