బాలీవుడ్ సినీ పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధర్మేంద్ర (Dharmendra) ఇకలేరు. ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం కలిగిన ఈ లెజెండరీ నటుడు ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్ (Bollywood)లో ఒక శకం ముగిసిపోయిందని సినీ ప్రముఖులు భావోద్వేగానికి గురవుతున్నారు.
బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర
సస్పెన్స్, క్రైమ్, యాక్షన్, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ధర్మేంద్రను అభిమానులు ప్రేమగా “బాలీవుడ్ హీ-మ్యాన్” (Bollywood He-Man)గా పిలిచేవారు. కండలవీరుడు, ఊరమాస్ హీరోగా ఆయనకు ఉన్న క్రేజ్ వర్ణనాతీతం. డాన్స్, ఫైట్, డైలాగ్, ఏ పాత్ర పోషించినా తన స్టైల్లో ప్రేక్షకుల చేత ఈలలు వేయించేవారు.
సినిమా ప్రయాణం
పంజాబ్ (Punjab)లోని లూధియానా (Ludhiana) జిల్లా నస్రాలి గ్రామం (Nasrali Village)లో 1935 డిసెంబర్ 8న ధరమ్ సింగ్ డియోల్ (Dharm Singh Deol)గా జన్మించారు.
తండ్రి కేవల్ కిషన్ సింగ్ డియోల్ (Kewal Kishan Singh Deol), తల్లి సత్వంత్ కౌర్ (Satwant Kaur). ఫిలింఫేర్ న్యూ టాలెంట్ షోలో సెలెక్ట్ అవ్వడంతో ముంబైకి వెళ్లి, సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డారు. అతని తొలి చిత్రం ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ (Dil Bhi Tera Hum Bhi Tera). అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా బాలీవుడ్‌లో సింహాసనాన్ని చేజిక్కించుకున్నారు.
ఎవర్‌గ్రీన్ హీరో
‘షోలే’ (Sholay) వంటి భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్‌లో లీడ్ పాత్ర పోషించి, అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. యాక్షన్‌తో పాటు రొమాంటిక్, ఎమోషనల్ పాత్రల్లోనూ ఆయన నటన అపారమైనది. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోకూడా అడుగుపెట్టి, బీజేపీ తరపున రాజస్థాన్ బికనీర్ నుంచి 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
కుటుంబం
ధర్మేంద్రకు రెండు భార్యలు. ప్రకాశ్ కౌర్, హేమా మాలిని. హేమా మాలిని ప్రస్తుతంలో బీజేపీ తరపున మథురా లోక్‌సభ సభ్యురాలు. ఈమెను బాలీవుడ్ “డ్రీమ్ గర్ల్”గా పిలుస్తారు. మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు నలుగురు పిల్లలు. హేమా మాలినితో ఇద్దరు కుమార్తెలు. అలాగే ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ బాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్నారు.
అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా
పంజాబ్‌లో పుట్టి బాలీవుడ్‌పై దుమ్మురేపిన ఈ యాక్షన్ కింగ్ తన నటనతో కోట్లాది ప్రేక్షకులను అలరించి, భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.








