కర్ణాటక (Karnataka)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల (Dharmasthala) పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (sanitation Worker) చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అక్కడ తవ్వకాలు చేపట్టగా, మానవ ఎముకలు, పుర్రె లభ్యమయ్యాయి.
ఆయన తెలిపిన ప్రకారం, గతంలో వందల మృతదేహాలను అక్కడ ఖననం చేశారట. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సిట్(SIT) అధికారులు ఇప్పటికే 13 సమాధి ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. సోమవారం జరిగిన తవ్వకాల్లో 11వ సమాధి వద్ద, ఒక పుర్రెతో పాటు అనేక ఎముకలు బయటపడ్డాయి. స్థానికంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లిన ఓ వ్యక్తి సూచన మేరకు అక్కడ తవ్వినప్పుడు కూడా మానవ అవశేషాలు లభ్యమయ్యాయి.
ఫోరెన్సిక్ పరీక్షలకు ఎముకలు
నేత్రావతి నది వద్ద నాలుగు అడుగుల లోతులో 15 ముక్కలుగా ఉన్న మానవ కళేబరం లభ్యమైంది. అది పురుషునికి చెందినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వయస్సు, లింగం, మరణ కారణం వంటి విషయాల నిర్ధారణ కోసం ఈ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇక, ఇచిలంపాడి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త టి. జయంత్ మరో సంచలన ఆరోపణ చేశారు. చట్టవిరుద్ధంగా ఒక మైనర్ బాలిక మృతదేహాన్ని పోలీసు అధికారి ఖననం చేశాడన్నారు. తానే ప్రత్యక్ష సాక్షినని, భయం కారణంగా అప్పట్లో ఎవరికి చెప్పలేకపోయానని తెలిపారు. దీనిపై సిట్ అధికారులు ఆయనను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సూచించారు.
మీడియా గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేత
ఇకపోతే, ఈ ఉదంతంపై యూట్యూబ్ చానళ్లకు నివేదికలు ఇవ్వడానికి అనుమతి ఇస్తూ, కర్ణాటక హైకోర్టు మీడియా గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తివేసింది. సిట్ మంగళూరులో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజల సలహాలు, సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.