ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథను వెండితెరపై చూపించేందుకు ఘనమైన ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ప్రధాన పాత్రగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా, ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం సినిమాపై అంచనాలు పెంచేసింది.
‘కలాం’ సినిమా ద్వారా రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కలాం చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వెండితెరపై చూపించనున్నారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో గుర్తింపు పొందిన ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు.
అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం రౌత్ గతంలో చేసిన “ఆదిపురుష్” అనుకున్నంత విజయం సాధించకపోయినా, “కలాం” బయోపిక్‌తో మళ్లీ తన సీరియస్ సినిమా మేకింగ్‌ను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.
ఓం రౌత్ చిత్ర లక్షణం చూస్తే…
బాల గంగాధర్ తిలక్ జీవితం ఆధారంగా ‘లోకమాన్య’,
శివాజీ సేనాపతిగా ‘తానాజీ’,
శ్రీరాముడి కథతో ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు తెరకెక్కించారు.
ఇప్పుడు, కలాం బయోపిక్ రూపంలో ఆయనకు మరో కీలక ప్రాజెక్ట్ చేతిలో ఉంది.
అబ్దుల్ కలాం నిరాడంబర జీవితం, DRDO-ISROలో చేసిన అద్భుత సేవలు, ఆయన విద్యాభిమానం, దేశ సేవ పట్ల ఉన్న నిబద్ధత. దేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలందించిన ఈ గొప్ప వ్యక్తి కథను ధనుష్ ఎంతగానో నెరవేర్చబోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.