రెండ్రోజుల క్రితం జరిగిన శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్, శివయ్య దర్శనం కోసం సామాన్య భక్తుల అవస్థలు పడిన ఘటన మరువక ముందే మహాశివరాత్రి పర్వదినం రోజు శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలోనూ భక్తులు చేదు అనుభవం ఎదురైంది.
మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా వీఐపీల సేవల్లో తరిస్తున్నారని, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సర్వదర్శనం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తమవుతోంది. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.
ఆలయ అధికారుల తీరుపై సర్వదర్శనం క్యూలైన్‌లోనే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు కూటమి ప్రభుత్వానికి, ఆలయ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయ ఈవోపై కూడా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రి వంటి ముఖ్య పర్వదినాల్లో ముందస్తు ప్రణాళికతో మెరుగైన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
నిన్న శ్రీశైలంలో శివ స్వాములపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన ఘటన మరువక ముందే శ్రీకాళహస్తి క్షేత్రంలో సామాన్య భక్తులను పట్టించుకోకుండా, గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోబెట్టడం ఆగ్రహం తెప్పిస్తోంది. వరుసగా రెండు ప్రముఖ శైవక్షేత్రాల్లో ఏర్పాట్లపై విమర్శలు రావడం చర్చనీయాంశమైంది.








