బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలే ఆమె ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ (Hollywood Walk Of Fame Star 2026)కి ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా, దీపికా ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్’ (The Shift) ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది.
వినోద రంగానికి గణనీయమైన సేవలు అందించిన వారికి ప్రతి ఏటా ఈ గౌరవాన్ని అందజేస్తారు. ఇందులో భాగంగా, ఈసారి మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఎంపిక కావడం విశేషం.
భారత్ నుంచి తొలిసారిగా దీపికకు దక్కిన అరుదైన గుర్తింపు
ఈ ప్రతిష్టాత్మక జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ప్రముఖులు ఉన్నారు. అయితే, భారతదేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతీయ సినీ ప్రపంచానికి లభించిన గొప్ప గుర్తింపు.
బాలీవుడ్ సూపర్స్టార్లైన షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి నటులకు ఇప్పటి వరకు ఈ గౌరవం దక్కకపోవడం గమనార్హం. తన అంతర్జాతీయ గుర్తింపు, ప్రత్యేకతతో ఈ ఘనతను అందుకోవడంలో దీపిక తన స్థాయిని మరోసారి నిరూపించుకుంది.