సాంకేతికత పెరిగేకొద్దీ మనుషుల మధ్య పరిచయాలు సులభమయ్యాయి. కానీ, అదే సాంకేతికత ఇప్పుడు ప్రాణాలను తీసే ఆయుధంగా మారుతోంది. తాజాగా విశాఖపట్నం గాజువాకలో జరిగిన మౌనిక హత్యోదంతం సమాజానికి ఒక హెచ్చరిక. డేటింగ్ యాప్‌లో మొదలైన పరిచయం, మూడు ముక్కల శవంగా మారడం వెనుక ఉన్న సామాజిక రుగ్మతలపై సమాజం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
డేటింగ్ యాప్‌లు..నేరాలకు కొత్త అడ్రస్
ఒకప్పుడు ప్రేమ అంటే మనసులు కలవడం.. కానీ ఇప్పుడు డేటింగ్ యాప్‌ల పుణ్యమా అని అది ‘శారీరక అవసరాల’ కోసమే అన్నట్లుగా మారిపోయింది. గాజువాక కేసులో నిందితుడు రవీంద్ర 2021లో మౌనికను డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెను నమ్మించి, లోబర్చుకున్నాడు. మౌనికతో సంబంధం ఉండగానే 2024లో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను పిలిపించుకుని, చివరకు తన సంసారానికి అడ్డు వస్తుందన్న నెపంతో గొంతు నులిమి చంపేశాడు. చంపడమే కాకుండా ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని మూడు ముక్కలు చేయడం చూస్తుంటే, నేరస్తుల్లో చట్టం పట్ల భయం ఎంతలా చచ్చిపోయిందో అర్థమవుతోంది.
బ్లాక్‌మెయిలింగ్ అడ్డాగా టెక్నాలజీ
కేవలం హత్యలే కాదు, డేటింగ్ యాప్‌ల ద్వారా వేలాది మంది మహిళలు ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. పరిచయం అయిన కొద్దిరోజులకే నగ్నంగా వీడియో కాల్స్ చేయించి, వాటిని రికార్డ్ చేసి లక్షల రూపాయలు గుంజుతున్న కేటుగాళ్లు ఎందరో. మన వ్యక్తిగత వివరాలను సేకరించి, వాటితో సోషల్ మీడియాలో వేధించడం పరిపాటిగా మారింది.
రాజకీయ రంగు.. రక్షణ ఎక్కడ?
మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది తప్ప, క్షేత్రస్థాయిలో భద్రత పెరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ‘దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్ల’ పనితీరుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా రక్షణ కోసం వినూత్న చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా, రోజుకో చోట అఘాయిత్యాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ పెట్రోలింగ్ పెంచడం, షీ టీమ్స్ ను బలోపేతం చేయడం వంటి చర్యలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.
- జాగ్రత్తలు తప్పనిసరి!
- ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చట్టాలు తెచ్చినా.. వ్యక్తిగత జాగ్రత్తలే శ్రీరామరక్ష.
- తెలియని వ్యక్తులతో డేటింగ్ యాప్స్ లో అతిగా చనువు పెంచుకోవద్దు.
- వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేయకూడదు.
- ఏదైనా అనుమానం వస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలి.
మౌనిక కేసు ఒక ఉదాహరణ మాత్రమే. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా లేకపోతే అగాధంలో పడిపోతామని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ప్రభుత్వం కూడా మాటలకే పరిమితం కాకుండా, నేరస్తులకు ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలి.







