యూఎస్ ఓపెన్ (US OPEN) 2025 టోర్నమెంట్ (Tournament)లో రష్యా (Russia)కు చెందిన టెన్నిస్ (Tennis) ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) తన ప్రవర్తన కారణంగా భారీ జరిమానా (Huge Fine)ను ఎదుర్కొన్నాడు. టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలవడంతో అతను కోపంతో రాకెట్ (Racket)ను విరగ్గొట్టడంతో పాటు, ప్రేక్షకులతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ చర్యలకు గాను టోర్నమెంట్ నిర్వాహకులు అతడికి $42,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹37 లక్షలు) జరిమానా విధించారు. ఇది అతనికి తొలి రౌండ్‌లో లభించే ప్రైజ్ మనీలో మూడో వంతుకు పైగా ఉండటం గమనార్హం.
మెద్వెదేవ్, తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ (France)కు చెందిన బెంజమిన్ బోంజి (Benjamin Bonzi) చేతిలో 6-3, 7-5, 6-7 (5), 0-6, 6-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ ఓటమిని తట్టుకోలేక అతను తన రాకెట్‌ను కోర్టులో కుర్చీకేసి పదేపదే కొట్టడంతో అది విరిగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలాగే, మూడో సెట్‌లో ఆట జరుగుతుండగా ఒక ఫోటోగ్రాఫర్ కారణంగా ఆట ఆరు నిమిషాలు నిలిచిపోయింది. ఆట మళ్లీ ప్రారంభమైనప్పుడు, అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మెద్వెదేవ్, ప్రేక్షకులను ఉద్దేశించి అరిచాడు. మ్యాచ్ తర్వాత అతను అసభ్యకరమైన సైగలు కూడా చేసినట్లు సమాచారం. ఈ చర్యల కారణంగానే అతనికి ఈ భారీ జరిమానా విధించారు.