దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని వెల్లడించారు. ఈ విషయాన్ని తాజాగా రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. టిబెట్ బౌద్ధగురువుగా ప్రసిద్ధి చెందిన దలైలామా గత ఆరు దశాబ్దాలుగా చైనా నియంత్రణపై పోరాడుతున్నారు.
వారసత్వంపై కీలక వ్యాఖ్యలు
దలైలామా రాసిన ‘వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్’ అనే పుస్తకంలో, తన తర్వాతి వారసుడు స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడని పేర్కొన్నారు. టిబెట్ వెలుపల, భారత్‌లో కూడా తన పునర్జన్మ సాధ్యమేనని ఆయన తెలిపారు. పునర్జన్మ అంటే పూర్వీకుల పని కొనసాగించడమేనని, కొత్త దలైలామా విశ్వకరుణకు గొంతుకగా ఉంటారని చెప్పారు.
23వ ఏటే టిబెట్ నుంచి భారత్‌కు వలస వచ్చిన దలైలామా, 1989లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తన వారసుడిగా చైనా ప్రకటించే ఎవరికీ టిబెటన్ బౌద్ధుల నుంచి గౌరవం దక్కదని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ధర్మశాలలో ఉన్నారు. అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.








