కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీలోని పాటిల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో కృష్ణా జలాల వాటాపై చర్చించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నీటి తరలింపును అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామన్నారు. ఏపీ చేపడుతున్న బనకచర్లపై తెలంగాణ రాష్ట్ర అభ్యంతరం తెలియజేశామన్నారు. బనకచర్లపై ఏపీ నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని చెప్పారు.
పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క- సారక్క ప్రాజెక్టులకు త్వరగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీకి ఎందుకు అభ్యంతరం..? అని ప్రశ్నించారు. గోదావరి జలాలపై ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందేనని సీఎం అన్నారు.
ఏపీ ప్రాజెక్టులపై మా అభ్యంతరాలు తెలిపాం – ఉత్తమ్
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు. ఏపీ నుంచి ఎలాంటి ప్రపోజల్ రాలేదని కేంద్రం చెప్పిందన్నారు. సీతారామ సాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాలని కేంద్రాన్ని కోరినట్లుగా మంత్రి ఉత్తమ్ వివరించారు.